పంచాయతీరాజ్ అనేది ఒక మూవ్‌మెంట్ అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టం-2019పై చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎస్కే‌ డే పంచాయతీరాజ్ ‌వ్యవస్థకు ఆద్యులని కేసీఆర్ తెలిపారు. అమెరికా రూరల్ డెవలప్‌మెంట్ శాఖను నిర్వహిస్తున్న ఎస్కే డే గురించి నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ గొప్పగా చెప్పడానిని నెహ్రూ విన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

భారతదేశం మూర్ఖుల చేత పరిపాలించబడుతోందంటూ ఎస్కే డే సాక్షాత్తూ నెహ్రూతోనే అన్నారని.. పంచవర్ష ప్రణాళికలలో ప్రాధాన్యతలను సైతం ఆయన తప్పుబట్టారని కేసీఆర్ తెలిపారు.

ఎస్కే డే చేసిన సూచనల కారణంగా ప్రధాని నెహ్రూ భారతదేశంలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యతనిచ్చారని సీఎం గుర్తు చేశారు. నెహ్రూలో మార్పును గమనించిన ఎస్కే డే వెను వెంటనే పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారని తెలిపారు.

కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 75 చదరపు గజాల వరకు నిరుపేదలకు గృహనిర్మాణానికి ఎలాంటి అనుమతి తీసుకోనక్కర్లేదని.. అలాగే వారి ఇంటిపన్ను సంవత్సరానికి రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయని కేసీఆర్ వెల్లడించారు. పరిపాలనలోనూ ఎప్పటికప్పుడు సంస్కరణలు అవసరమని సీఎం తెలిపారు.