తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అలుపెరగకుండా పనిచేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ సంక్షోబాన్న నివారించి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రభుత్వం నడుం బిగించిదన్నారు. అందుకోసం ఇప్పటికే చాలా పథకాలు రూపొందించి అమలు చేస్తున్నామని, భవిష్యత్ లో మరిన్ని సంక్షమ పథకాలను తీసువస్తామని వివరించారు. తెలంగాణలో రైతు రాజ్యం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా 17 వేల కోట్ల వ్యవసాయ  రుణాలను మాఫీ చేసి, రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కల్గించామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎగ్గొట్టిన ఇన్ పుట్ సబ్సీడీలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించి రైతులకు ఉపశమనం కల్గించిందన్నారు. అలాగే గత ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే లక్షన్నర ఇచ్చి చేతులు దులుపుకునేవని, కానీ తమ ప్రభుత్వం ఆ పరిహారాన్ని 6 లక్షలకు పెంచి పెద్దదిక్కును కోల్పోయిన రైతు కుంటుంబాలను అండగా నిలిచిందని గుర్తు చేశారు. 

గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నామని అన్నారు. నకిలీ విత్తనాలు,   కల్తీ ఎరువులు,  కల్తీ  పురుగు మందుల తయారీని, పంపిణీని అరికట్టేందుకు ప్రభుత్వం  చట్టాలను  కఠిన తరం చేసిందని గుర్తుచేశారు. ఈ కల్తీ నేరాలన్నిటినీ  పిడి యాక్టు పరిధిలోకి తీసుకువచ్చి , అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా   నకిలీ విత్తనాలు తయారుచేస్తున్న   ఐదు కంపెనీలపై పీడీయాక్ట్ నమోదు చేసి, ఆ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మొదట 9 గంటలు విద్యుత్ అందించిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుండి 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తుందన్నారు.

ఇక భూ ప్రక్షాళణ, రైతు బంధు, రైతులకు భీమా పథకాలను తీసువచ్చి గ్రామాల్లో పండగ వాతావరనం కల్పించామన్నారు. ఇలా మరిన్ని సంక్షేమ పథకాలను రైతులకోసం, వ్యవసాయాభివృద్దికోసం రూపొందిస్తున్నట్లు కేసీఆర్ తన జాతీయ దినోత్సవ ప్రసంగంలో వివరించారు.