అమెరికాలో సైతం నల్లజాతీయుడిని దేశాధ్యక్షుడిని చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిందే బీఆర్ఎస్ అని సీఎం పేర్కొన్నారు.  అన్నం పెట్టే రైతులు చట్టాలు చేయలేరా, మార్పు మహారాష్ట్రతోనే మొదలవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

లక్ష్యం లేని సమాజం , లక్ష్యం లేని దేశం ఎటు పోతాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. గురువారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు . అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ. ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యం అయిపోయిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లయినా కూడు, గూడు, గుడ్డ దొరకడం లేదన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం మారింది, ఏమైనా మార్పు జరిగందా అని కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఎన్నో నదులున్నా వ్యవసాయానికి నీళ్లు లేవని, దేశ రాజధాని ఢిల్లీలోనూ సరిపడా నీళ్లు లేకపోవడం దారుణమన్నారు. గంగా, యమున డెల్టాలో వున్న ఢిల్లీ పరిస్థితిని చూసి బాధేస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మరో ఆరు నెలల్లో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని.. మంచిగా పనిచేసేవాళ్లకే ప్రజలు అధికారం ఇస్తారని సీఎం పేర్కొన్నారు. ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో వున్న నీటి వనరులను పూర్తిగా వాడుకోవడం లేదని.. సరిగా వాడితే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చని, అప్పుడు మంచినీటి సమస్య సైతం తీరుతుందన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిందే బీఆర్ఎస్ అన్న కేసీఆర్.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. అమెరికాలో సైతం నల్లజాతీయుడిని దేశాధ్యక్షుడిని చేశారని ఆయన గుర్తుచేశారు. 

దేశంలో సరిపడా కరెంట్ వున్నా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయానికి ఇచ్చే కరెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం లేదని.. కానీ తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అక్కడ నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నామని చెప్పారు. దేశంలో 48 శాతం మంది రైతులేనని.. తెలంగాణలో రైతు ఎలా చనిపోయినా రైతు బీమా అందజేస్తున్నామని తెలిపారు. 8 రోజుల్లోనే రైతు కుటుంబం ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 

తెలంగాణలో పండిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని.. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో రైతులకు ఫ్రీగా కరెంట్, నీళ్లు ఇస్తున్నామని.. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రం ఇంత చేయగలిగితే మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం ఎందుకు చేయలేదని సీఎం ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతులు చట్టాలు చేయలేరా, మార్పు మహారాష్ట్రతోనే మొదలవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర బడ్జెట్ రూ.10 లక్షల కోట్లకు చేరాలని సీఎం ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ వాళ్లు సైతం అక్కడికి రమ్మంటున్నారని.. తెలంగాణ మోడల్ అమలు చేస్తే మహారాష్ట్రను వదిలేసి మధ్యప్రదేశ్‌కు వెళ్తామని కేసీఆర్ తెలిపారు. 

మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసేంత వరకు తాము పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు దివాళా తీస్తాయి. ప్రజలు దివాళీ చేసుకుంటారని సీఎం జోస్యం చెప్పారు. తాను నాందేడ్ వస్తుంటే ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నారని.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే రానని చెప్పానని కేసీఆర్ తెలిపారు.