నిజామాబాద్ సభలో తన నమ్మకాలపై ప్రధాని వేసిన సెటైర్లకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి... తాను ఏ పూజ చేసుకుంటే మోడీకెందుకని... నా దగ్గరకి వస్తే తీర్థం పోస్తానని సెటైర్లు వేశారు.

తనకు దేవుడంటే నమ్మకమని అందుకే పూజలు, హోమాలు చేసుకుంటున్నానని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు చాలామంది వచ్చి.. చాలా చెబుతారు కానీ మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని జనానికి కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ ముందే ఉందన్నారు సీఎం. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానన్న చంద్రబాబు కరెంట్ ఎందుకు ఇవ్వలేదన్నారు. కిరణ్ ‌కుమార్ రెడ్డి ఓ కర్ర ముక్క పెట్టుకుని తెలంగాణ వస్తే రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోతుందన్నారని.. కానీ ఇప్పుడు తెలంగాణ విద్యుత్ సరఫరా వినియోగంలో ముందుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

తాను నిజామాబాద్‌కు తాగునీరు, సాగునీరు అందించలేదని ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ఒక్కడిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, బీజేపీ, టీజేఎస్‌లు ఒక్కటయ్యాయని మహాకూటమిపై విమర్శలు కురిపించారు.

బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను తరిమికొట్టి.. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తాను ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని... 119 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తాను ప్రజలను నమ్ముతున్నానని... మద్యం బాటిళ్లను నమ్మనని సీఎం అన్నారు.

గంట గంటకు కరెంట్ సరఫరాను మానిటరింగ్ చేస్తున్నానని.. అందుకే 24 గంటల విద్యుత్ ఇవ్వగలగుతున్నానని కేసీఆర్ వెల్లడించారు. 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారం ఉందని కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు మన పథకాలను కాపీ కొడుతున్నారని.. అలాంటి వ్యక్తి మేధావి ఎలా అవుతారని కేసీఆర్ దుయ్యబట్టారు. పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు..

 

నిమ్మకాయ, మిరపకాయ అంటాడు...కేసీఆర్ నమ్మకాలపై మోడీ సెటైర్లు

బాబును కాను, అక్కడే తేల్చుకుందాం: మోడీకి కేసిఆర్ సవాల్