తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌కు బహిరంగసభలో ప్రసంగించిన ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం చేసింది ఏం లేదన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి గోదావరి జలాలను అందిస్తానని... లేదంటే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రధాని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో.. ఆయనలో అభద్రతాభావం పెరిగిపోయిందన్నారు.

అందుకే పాలనను పక్కనబెట్టి యజ్ఞాలు, హోమాలు చేస్తున్నారని.. కేసీఆర్‌కు నిమ్మకాయలు, మిరపకాయలే ముఖ్యమని మోడీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక నాణేనికి బొమ్మ, బొరుసు వంటివని.. రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనని నరేంద్రుడు విమర్శించారు.