ఏపీని ఎప్పుడో తొక్కేశాం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. కాగా.. ఈ నేపథ్యంలో తాజాగా.. టీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని కేసీఆర్ అన్నారు. తమ పార్టీ రాష్ట్రం కోసమే పుట్టిందని.. తమ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతోందన్నారు. టీఆర్ఎస్ ను దేశంలోనే ఓ రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 100 కు పైగా స్థానాలు గెలుస్తుందని తాజా సర్వేలో వెల్లడైందన్నారు.

రాష్ట్రంలో బోలెడన్ని అభివృద్ధి పథకాలను చేపట్టామన్న కేసీఆర్.. మిషన్ భగీరథ అనేది దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇదో అనన్య సామాన్యమైన విషయమని పేర్కొన్నారు. ‘‘ఊహించనంత వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాం. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నాం. ఏ డంభాచారం కొట్టి.. మేం విడిపోతే మీరు చెడిపోతారన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎప్పుడో అట్టడుగుకు తోసేశాం. ఏపీలో వరిసాగు 50 లక్షల ఎకరాల దగ్గరుంటే.. మనం కోటి 3 లక్షల ఎకరాల వరి సాగు దగ్గరకు మనం వెళ్లాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

‘‘ఒక దఫాలో కోటి 32 లక్షల ఎకరాల సాగు చేసే స్థితికి తెలంగాణను తీసుకొచ్చాం. ఉద్యానవన పంటల సాగు దీనికి అదనం. జఠిలమైన విద్యుత్ సమస్యను త్వరగా పరిష్కరించాం. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రారంభించిన బస్తీ దావఖానాలను మన దగ్గర అంత కంటే మెరుగ్గా ప్రారంభించాం. హైదరాబాద్ సిటీలోనూ అద్భుతాలను ఆవిష్కారం చేశాం. నగరాభివృద్ధికి రూ.67 వేల కోట్లు ఖర్చుపెట్టాం’’ అని కేసీఆర్ తెలిపారు.