Asianet News TeluguAsianet News Telugu

రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతా : బెంగళూరులో కేసీఆర్ కీలక ప్రకటన

బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని ఆయన తెలిపారు. దేశంలో మార్పు తథ్యమని కేసీఆర్ జోస్యం చెప్పారు. 

telangana cm kcr sensational comments on national politics in bangalore tour
Author
Bangalore, First Published May 26, 2022, 4:45 PM IST

దేశంలో మార్పు తథ్యమని.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం బెంగళూరులో జేడీఎస్ అధినేత , మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారతదేశ జీడీపీని సైతం చైనా అధిగమించిందని గుర్తుచేశారు. మనదేశంలో పుష్కలమైన మానవ వనరులు వున్నాయని.. అమోఘమైన యువశక్తి వుందని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిలో చైనా మనదేశాన్ని దాటికి దూసుకుపోతోందన్నారు.

ఇప్ప‌టికే ఎందరో ప్ర‌ధానులు దేశాన్ని ప‌రిపాలించార‌ని, ఎన్నో ప్ర‌భుత్వాలు రాజ్యాన్ని ఏలాయ‌ని, అయినా.. దేశ ప‌రిస్థితి ఏమాత్రం మార‌లేద‌ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డ‌చినా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే వుండిపోయింద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌ని సీఎం గుర్తుచేశారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎవ‌రి సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాద‌ని సీఎం అన్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని.. దీనిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేసీఆర్ దుయ్యబట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందని.. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్ధికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

అనంతరం క‌ర్నాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్న‌ారని తెలిపారు. ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్ కోసం అనేక మంది నేత‌లతో కేసీఆర్ భేటీ అవుతున్న‌ట్లు కుమారస్వామి చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. దేశాన్ని ర‌క్షించుకోవాల‌న్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ఫ్రంట్‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కుమార‌స్వామి పేర్కొన్నారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసం మార్పు అవ‌స‌రం అని, పేద ప్ర‌జ‌ల కోసం కూడా మార్పు కావాల‌ని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నార‌ని ఆయన వెల్లడించారు. 

ఇకపోతే.. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని భావించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప‌ని చేస్తున్నాయ‌ని, రాష్ట్రాల‌పై పెత్త‌నం చేలాయిస్తున్నాయ‌ని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అధికారాలు అన్నీ కేంద్రం వ‌ద్దే పెట్టుకుంటోంద‌ని, గ్రామ స్థాయి అంశాల‌కు సంబంధించిన‌వి కూడా కేంద్రం వ‌ద్దే వున్నాయని ఆయన మండిపడుతున్నారు.

దేశానికి కొత్త దశ, దిశ చూపాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. దేశాన్ని పాలించిన రెండు పార్టీలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయంటూ బీజేపీ, కాంగ్రెస్‌లపై కేసీఆర్ మండిపడ్డారు. ఆ తర్వాత వరుసపెట్టి పర్యటనలు మొదలుపెట్టారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఈరోజు బెంగళూరు వెళ్లారు సీఎం. 

Follow Us:
Download App:
  • android
  • ios