ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్నటి కాదు.. కేంద్రం హిట్ లిస్ట్‌లో 4 రాష్ట్ర ప్రభుత్వాలు : కేసీఆర్
ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్న జరిగింది కాదని... ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 8 ప్రభుత్వాలను ఇప్పటికే ఈ దేశంలో కూల్చామని వీడియోలో అంటున్నారని.. మరో నాలుగు ప్రభుత్వాలను కూల్చుతామని చెబుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
45 ఏళ్లుగా ప్రజాజీవితంలో వున్నామని.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గురువారం ఆయన ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇబ్బందికరమైన పరిస్ధితులు వున్నాయన్నారు. తాను చాలా బాధతో మాట్లాడుతున్నానని.. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో సిగ్గుపడే పరిస్ధితి వుందని.. పాల్వాయి స్రవంతి తనను కలిసినట్టుగా దుష్ప్రచారం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. హుజురాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిందని.. సాగర్, హుజుర్‌నగర్‌లో తాము గెలిచామని ఆయన గుర్తుచేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. రాజకీయాల్లో సంయమనం అవసరమని కేసీఆర్ హితవు పలికారు. ఎన్నికల కమీషన్ విఫలమైందని విమర్శలు చేస్తున్నారని.. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ విఫలమయ్యారని విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ఈసీ వాళ్లకు అనుకూలంగా పనిచేయాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత దిగజారడం సరికాదని.. అసలు ఈ రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతోందని సీఎం నిలదీశారు. దేశంలో ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి.. ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలోనూ తాము ఇంత హీనంగా ప్రవర్తించలేదన్నారు.
దేశంలోని అన్ని పత్రికా సంస్థలకు ఈ వీడియోలు పంపానని.. ఎదురులేని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజాగ్రహానికి గురయ్యారని కేసీఆర్ గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు , పార్టీల అధ్యక్షులకు వీడియోలు పంపుతానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఫాంహౌజ్ ఫైల్స్ ఇప్పటికే పంపించానని .. దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టుకు ఈ వీడియోలను పంపుతానని సీఎం తెలిపారు. బెంగాల్ వెళ్లి ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని స్వయంగా ప్రధానే చెప్పారని ... ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశం దెబ్బతింటే తీవ్రంగా నష్టం జరుగుతుందని.. గత నెలలో ఇక్కడికి రామచంద్ర భారతి వచ్చారని సీఎం తెలిపారు.
తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారని కేసీఆర్ అన్నారు. ఫాంహౌజ్ ఫైల్స్ మూడు గంటలు వున్నాయని.. కోర్టుకు మొత్తం వీడియో ఫుటేజ్‌లు సమర్పించామని కేసీఆర్ తెలిపారు. 8 ప్రభుత్వాలను ఇప్పటికే ఈ దేశంలో కూల్చామని వీడియోలో అంటున్నారని.. మరో నాలుగు ప్రభుత్వాలను కూల్చుతామని చెబుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చుతామని చెబుతున్నారని.. రాక్షసుల కుట్రను బద్ధలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది నిన్నా మొన్నా జరిగింది కాదని సీఎం వ్యాఖ్యానించారు.