Asianet News TeluguAsianet News Telugu

పోరాటాలు సఫలీకృతం కావాలంటే.. అన్నదాతలు రాజకీయాల్లోకి రావాల్సిందే : రైతు ప్రతినిధులతో కేసీఆర్

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో రోజు సమావేశమయ్యారు. రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలని.. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని కేసీఆర్ ప్రశ్నించారు.
 

telangana cm kcr second day meeting with farmers union leaders
Author
First Published Aug 28, 2022, 6:30 PM IST

రైతు సంఘాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంటరీ ఉద్యమ పంథాలో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు కేసీఆర్. ఆనాడు తెలంగాణ వ్యతిరేకులతో జై తెలంగాణ అనిపించామని, ఇప్పుడు రైతు వ్యతిరేకులతో జైకిసాన్ పలికించామన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సూచించారు కేసీఆర్. ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికి ఒక యువకుడిని పంపమని అడిగానని.. అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణను నిజం చేశానని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రాజకీయ నిర్ణయాల వల్లే ప్రజా జీవితాలు ప్రభావితం అవుతాయని.. చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం కావని సీఎం అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలని.. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని కేసీఆర్ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఇంకా సమస్యలున్నాయని సీఎం అన్నారు. వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని కేసీఆర్ పేర్కొన్నారు. 

కాగా.. సీఎం కేసీఆర్ శ‌నివారం వినూత్న సమావేశాన్ని నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి చేప‌ట్టని విధంగా చ‌రిత్ర‌లో తొలిసారి.. దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన  రైతుల సంఘాల నాయ‌కుల‌తో  ఆయ‌న విస్తృత స్థాయి స‌మావేశ‌మ‌య్యారు. ప్రగ‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్  అధ్యక్షతన వ‌హించారు. ఈ స‌మావేశం ఉద‌యం నుంచి రాత్రి దాకా సుధీర్ఘంగా కొన‌సాగింది. ఈ కార్యక్ర‌మంలో రైతు ప్రతినిధులు, జాతీయ రైతుసంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వ్య‌వ‌సాయ ప‌రిస్థితులు, ప‌ద్ద‌తులు, ఆయా ప్ర‌భుత్వాల నుంచి అందుతున్న మ‌ద్ద‌తు, సాగులో నూత‌నంగా అందివ‌స్తున్న సాంకేతికత త‌దిత‌రాల‌పై కేసీఆర్ చ‌ర్చించారు. 

Also Read:దేశంలోనే తొలిసారి విస్తృత రైతు సమావేశం.. రోజంతా రైతుల‌తోనే సీఎం కేసీఆర్ భేటీ!

అలాగే..  తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు అందిస్తున్న మ‌ద్ద‌తును కూడా కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతన్న‌ల‌కు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా.. రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా అందించే రైతు బంధు ప‌థ‌కం గురించి కేసీఆర్ వివ‌రించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది.   

ఈ సంద‌ర్భంగా రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు. పంటలు పండించడంతోపాటు, గిట్టుబాటు ధరలను కల్పించాల‌ని డిమాండ్ చేశారు. అసంఘటితంగా ఉన్న రైతాంగం సంఘ‌టితం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని రైతు సంఘాల నాయ‌కులు ఆకాంక్షించారు. దేశంలో సరికొత్త రైతు ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరమున్నదని వారు స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios