హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు మంచి ప్రణాళికతో ముందుకువెళ్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లు సన్నద్ధం చేసే అంశంపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నగరాల అభివృద్ధిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరాలు అభివృద్ధి చెందుతున్నతరుణంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అలాంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారాలు చూపేలా ప్రణాళికలు రెడీ చెయ్యాలని ఆదేశించారు. 

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో రాష్ట్రమంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామన్నారు.

హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను హెచ్ఎండిఏతోపాటు వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసి అప్పగిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీపైనే నిధుల గురించి ఆధారపడకుండా ఇతర మార్గాలను కూడా అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. 

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వలస వస్తున్నారని స్పష్టం చేశారు. నగరంలోని వాతావరణం, సామరస్య పూర్వక జీవనవిధానం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. 

హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వివిధ కారణాల వల్ల ప్రతీ ఏడాది 5 నుంచి 6లక్షల జనాభా హైదరాబాద్ కు వస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడుతున్నారన్నారు. 

ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి వెళ్లేవారి సంఖ్య కూడా పెరుగుతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ ఏడాది రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలన్నీ నగర ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశాలుగా అభివర్ణించారు. 

అయితే పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే భవిష్యత్  నరకప్రాయంగా మారక తప్పదని కేసీఆర్ అధికారులకు హెచ్చరించారు. హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్ షా చెప్పిన మాటలను గుర్తు చేశారు. 

నేను నగరాన్ని కాదు, స్వర్గం నిర్మిస్తున్నా అన్నారని నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోయాయన్నారు. హైదరాబాద్ నగరమంటేనే ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని కానీ అది లేదన్నారు. 

మూసీ నదిని మురికిగా మార్చేశారన్నారు. నగరంలో పచ్చదనం తగ్గి కాలుష్యం పెరుగుతోందన్నారు. విపరీతమైన ట్రాఫిక్ సమస్య కూడా ఉందన్నారు. రాబోయే కాలంలో జనాభా మరింత పెరిగి పరిస్థితి చేయిదాటిపోతుందని జీవనం దుర్భరంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మనమంతా ఇప్పుడే మేల్కొనాలని పిలుపునిచ్చారు. 

భవిష్యత్ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమలు చేయాలని కోరారు. ఢిల్లీ, బెంగళూరు, బీజింగ్ వంటి ప్రముఖ నగరాలు కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రానీయకూడదన్నారు. 

హైదరాబాద్ నగరాన్ని ఓఆర్ఆర్ లోపలున్న నగరం, ఓఆర్ఆర్ వెలుపలి నగరం, ఆర్ఆర్ఆర్ అవతల నగరంగా మూడు విభాగాలుగా విభజించి ప్రణాళికలు రచించాలని కోరారు. విభజన వల్ల మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అంచనాలు వేయవచ్చునన్నారు. 

ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీ వంటి వాటిని ప్రత్యేకంగా రూపొందించాలని కోరారు. మాస్టర్ ప్లాన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదని మాస్టర్ ప్లాన్ లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి మంత్రివర్గం అనుమతి తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీరు అందించేందుకు కేశవాపూర్ లో నిర్మించనున్న మంచినీటి రిజర్వాయర్ కి ఈనెలలోనే శంకుస్థాపన చేసి శరవేగంగా పూర్తి చెయ్యనున్నట్లు తెలిపారు. అలాగే మెట్రోరైలును ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, సిఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.