తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెండు రోజుల పాటు భారీ వర్ష సూచనలు చేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను కే. చంద్రశేఖర్ రావు కోరారు.

కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.

భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ అప్రమత్తం చేశారు.

మరోవైపు హుస్సేనీ ఆలంలోని పాత రేకుల ఇల్లు కూలి ఇద్దరు మహిళలు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనీస్ బేగం, ఫరా బేగం అనే ఇద్దరు యువతులు మరణించారు.

గాయపడిన మహమ్మద్ ఖాన్, పర్వీన్ బేగం, అంజాద్ ఖాన్, హసంఖాన్, హుస్సేన్ ఖాన్ ఆసుపత్రిలో చిక్కుకున్నారు. నగరంలో కురిసిన భారీ వర్షానికే ఇల్లు కూలినట్లు అధికారులు వెల్లడించారు.