Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే భూముల‌ డిజిటల్ సర్వే : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.

telangana cm kcr review meeting on Dharani portal ksp
Author
Hyderabad, First Published Feb 18, 2021, 9:22 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు నిర్ణయాలను సీఎం ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 

ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయిందని సీఎం స్పష్టం చేశారు. నోరులేని, అమాయక రైతులకు న్యాయం జరిగిందని, ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగిందని కేసీఆర్ గుర్తుచేశారు.

జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగిందని... డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని సీఎం వెల్లడించారు.

బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతోందని చంద్రశేఖర్ రావు చెప్పారు. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలుందని, ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios