హైదరాబాద్:వచ్చే డిసెంబర్ నెల నుండి నీటి బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని గ్రేటర్ ప్రజలకు వరాలు కురిపించారు. 20 వేల లీటర్ల వరకు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.97 శాతం ప్రజలకు  దీని పరిధిలోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.   

 

 

సోమవారం నాడు తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ సీఎం జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అపార్ట్‌ మెంట్ల కు కూడ నీటి ట్యాక్స్  కమర్షియల్ పరిధిలో ఉందన్నారు. 20 వేల లీటర్ల వరకు అపార్ట్ మెంట్లలో  కూడ ఉచితంగా నీటిని అందిస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ రాష్ట్రంలో ఈ పథకం విజయవంతమైందన్నారు. రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తామన్నారు. 

 రాయదుర్గం నుండి ఎయిర్ పోర్టు వరకు బీహెచ్ఈఎల్ నుండి మెహిదీపట్నం వరకు మెట్రో ను పొడిగిస్తామని ఆయన చెప్పారు.దేశంలోనే హైద్రాబాద్ గొప్ప చారిత్రక నగరమన్నారు. నగరానికి చాలా అద్భుతంగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. గత ఎన్నికల కంటే  ఎక్కువ స్థానాలను తమకు కట్టబెట్టాలని ఆయన ప్రజలను కోరారు. 

వరద నీటి నివారణకు రూ. 12 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. మహానగరానికి రూ. 13 వేల కోట్లతో సముద్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ అందిస్తామన్నారు. 

గోదావరితో మూసీ నదిని అనుసంధానం చేయనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.  ప్రస్తుతం నడుస్తున్న దానికంటే అదనంగా మరో 90 కి.మీ. దూరం ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతామని కేసీఆర్ ప్రకటించారు. 

నగరాన్ని జీరో కార్బన్ సిటీగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్ఆర్‌డీపీ 2,3 దశలను అమలు చేస్తామన్నారు. నగరంలో రెండో దశలో 125 లింక్ రోడ్లను కూడ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు అందిస్తామన్నారు. 

నగరంలోని సెలూన్లకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని  సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.  దోబీఘాట్లు, లాండ్రీలకు కూడా ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. 

నగరంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లన్నీ ఇకపై అండర్ గ్రౌండ్ నుండే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు.

బస్తీల్లోని ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెడతామని చెప్పారు.  కరోనా సమయంలో మోటారు వాహన పన్నును రద్దు చేస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.