కొట్లాట అంటే కొట్లాట... పోతిరెడ్డిపాడు వివాదంపై సీఎం కేసీఆర్ స్పందన
పోతిరెడ్డిపాడు విషయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు
పోతిరెడ్డిపాడు విషయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని నీటి ప్రాజెక్ట్‌లపై తమకు స్పష్టమైన అవగాహన వుందన్నారు. తాము ఎఖ్కడా నిబంధనలు అతిక్రమించలేదన్న కేసీఆర్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడే వ్యక్తిని కాదన్నారు.
రాయలసీమకు నీళ్లు వెళ్లాలని తాను గతంలో అన్నానని, ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి.. వాటిని రాయలసీమకు తీసుకుపోవాలని చెప్పామన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
గోదావరి మిగులు జలాలను ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని, చిల్లర పంచాయతీలతో ఏమీ సాధించమని చెప్పినట్లు సీఎం గుర్తుచేశారు. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నామన్న ముఖ్యమంత్రి.. తమకు రెండు నాల్కలు లేవని చెప్పారు.
రాయలసీమ గోదావరి మిగులు జలాలు వాడుకోవచ్చని, కృష్ణా జలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. చట్టం పరిధిలోనే తమ ప్రజలకు న్యాయం చేస్తామని కేసీఆర్ తెలిపారు.
బాబ్లీపై పంచాయతీ పెట్టి ఏం సాధించారని సీఎం ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు గురించి ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసునని వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.