తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా సోకినట్లు సీఎం తెలిపారు. మంగళవారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1,096కు చేరుకుంది. 43 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 628కి చేరింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 439కి చేరింది.

దేశంలో కరీంనగరే మొదటి కంటైన్‌మెంట్ జోన్ అని .. ప్రభుత్వ చర్యల కారణంగా ఒక్క ప్రాణం  కూడా పోకుండా కాపాడుకున్నామని సీఎం తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తెలంగాణ వందశాతం సక్సెస్ అయినట్లు వెల్లడించారు.

ముందు నుంచి పకడ్బందీగా చర్యలు చేపట్టడం వల్ల వైరస్‌ను అదుపు చేసి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచామని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి నేర్చుకుని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేశామని ఆయన చెప్పారు.

దేశంలో మరణాల రేటు 3.37 శాతంగా ఉంటే తెలంగాణలో 2.64 శాతంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 42.7 శాతంగా ఉందని.. కరోనా కట్టడికి కృషి చేసిన అధికారులు, నేతలు, సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో భయంకరంగా చనిపోతున్నారని కేసీఆర్ గుర్తుచేశారు.