హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదివారం శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ లో నిజాయితీ, తపన ఉన్నాయని ఆయన అన్నారు. నల్లగొండ, పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు.

వైఎస్ జగన్ ఎపి సిఎం అయిన తర్వాత ఎపితో సుహృద్భావ వాతావరణం నెలకొందని కేసీఆర్ చెప్పారు. కృష్ణానదిలో నీళ్ల గ్యారంటీ లేదని, ఒక్కోసారి ఐదేళ్ల వరకు కూడా చుక్క నీరు రాదని ఆయన అన్నారు. ఉభయ రాష్ట్రాల రైతాంగ ప్రయోజనాల కోసం కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేద్దామని తాను జగన్ ను కోరానని, యువకుడైన జగన్ లో నిజాయితీ ఉందని కేసీఆర్ అన్నారు. 

రాష్ట్రానికి మంచి చేయాలనే తపన జగన్ కు ఉందని, సహృదయంతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని, కొద్ది రోజుల్లో మళ్లీ చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఉభయ రాష్ట్రాల రైతాంగ ప్రయోజనం కోరి విశాల దృక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టును విజయవంతంగా నిర్మించుకున్న అనుభవం నుంచి తాను ఎపి ముఖ్యమంత్రికి నిజాయితీ ఉందని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రజరలకు ఉపయోగపడే రీతిలో ఎపికి తెలంగాణ సాయం ఉంటుందని చెప్పారు. ఆంధ్ర, రాయలసీమల్లోని కరువు నేలలు తడవాలని, అక్కడి ప్రజల దాహార్తి తీరాలని అన్నారు. ఇటీవల ఆంధ్ర సిఎం వచ్చారని, ఇద్దరం సమావేశమయ్యామని, తెలంగాణ వచ్చిన తర్వాత మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. బేసిన్ లు లేవు, బేషిజాలు లేవని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు బాగుపడాలని కేసీఆర్ అన్నారు.