త్వరలోనే యూపీ టూర్ కు కేసీఆర్: భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.బీహార్ టూర్ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ యూపీ టూర్ చేయనున్నారు. ఈ విషయమై త్వరలోనే టీఆర్ఎస్ నాయకత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యూపీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాలపై కేంద్రీకరించిన కేసీఆర్ యూపీలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు.బీజేపీయేతర పార్టీల నేతలను సీఎం కలుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు మాజీ సీఎం , ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. బీహర్ టూర్ విజయవంతమైందని ఆ పార్టీ భావిస్తుంది.
దీంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పలుమార్లు కేసీఆర్ తో సమావేశమన విషయం తెలిసిందే. యూపీ పర్యటనలో భారీ బహిరంగ సభ గురించి సమాజ్ వాదీ పార్టీ అగ్రనేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే సభలో బీజేపీ వ్యతిరేక కూటమి నేతలు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కేసీఆర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు సంబంధించి త్వరలోనే అధికారికంగా టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నెల 3వ తేదీన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ ఏ రకమైన పాత్ర పోషించనుందో వివరించనున్నారు. ఈ నెల 3వ తేదీ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుందపి ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎబిఎన్ కథనం ప్రసారం చేసింది.
2024 లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలు, సీఎంలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇండియా కంటే చిన్న దేశాలు కూడా ఆర్ధికంగా బలోపేతం అవుతున్నాయన్నారు. దేశాన్ని ఆర్ధికంగా తిరోగమనం వైపునకు కేంద్రం తీసుకెళ్తుందని కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. మరో వైపు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ విమర్శలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోనే కేసీఆర్ కు చెక్ పెట్టాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతుంది.