తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్ణాటక సీఎం కుమారస్వామితో మంతనాలు జరిపారు. అవి రాజకీయ చర్చలు కాదు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి అంతకన్నా కాదు. జూరాల ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలు వేసవి కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుమారస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. జూరాల నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చటం కోసం నారాయణ్‌పూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని  అధికారులను ఆదేశించారు.

ఈ విషయాన్ని వెనువెంటనే కుమారస్వామి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి తెలిపారు.  ఇది పాలమూరు జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరపున కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ శుక్రవారం సాయంత్రం నుంచి జూరాలకు నీటి విడుదల ప్రారంభం కానున్నది.