Asianet News TeluguAsianet News Telugu

మరో యాగాన్ని తలపెట్టిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో యాగానికి తలపెట్టారు. గత నెలలో ఎన్నికల్లో విజయం కోసం రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం చేయనున్నారు. 

telangana cm kcr palns to conduct one more maha yagam
Author
Hyderabad, First Published Dec 29, 2018, 11:02 AM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో యాగానికి తలపెట్టారు. గత నెలలో ఎన్నికల్లో విజయం కోసం రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి 25దాకా ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.

శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో, శృంగేరీ శారదా పీఠం సంప్రదాయంలో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. చతుర్వేద పండితుడు, జ్యోతిరాప్తోర్యామ యాజి మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ, ఫణిశశాంక శర్మ తదితరుల ఆధ్వర్యంలో జరిగే ఈ మహాక్రతువులో 200మంది రుత్వికులు పాల్గొననున్నారు. 

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా ఈ యాగానికి రానున్నట్లు సమాచారం. ఈ యాగ నిర్వహణకు సంబంధించి కేసీఆర్.. మాణిక్య సోమయాజితో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలిరోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. అన్నీ కలిపితే వెయ్యి పారాయణలవుతాయి. 

ఐదో రోజు 11 యజ్ఞకుండాల వద్ద.. ఒక్కో యజ్ఞకుండం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. మహారుద్ర యాగంలో భాగంగా నాలుగు రోజులూ కలిపి వెయ్యి పైచిలుకు రుద్రపారాయణలు, చివరిరోజున రుద్ర హవనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios