హైదరాబాద్: విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతిని తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిలింనగర్ సన్నిధానంలో స్వరూపానందేంద్ర సరస్వతితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేసీఆర్. 

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యం, మే 23న ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ తరుణంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎప్పటి నుంచి కార్యచరణ చేపట్టాలి..ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

ఫెడరల్ ఫ్రంట్ బలోపేతం, కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్రం వంటి అంశాలకు సంబంధించి ముహూర్తాలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కేసీఆర్ కు స్వరూపానందేంద్ర సరస్వతి అంటే చాలా భక్తి ఎక్కువ. ఏ కార్యం తలపెట్టాలన్నా స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకోవడం కేసీఆర్ కు ఆనవాయితీ. 

ఇటీవలే స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. అంతేకాదు పలు పూజాది కార్యక్రమాలు సైతం నిర్వహించారు. లోక కళ్యాణార్థం పలు పూజాదికార్యక్రమాలు కూడా కేసీఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే.