ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం.. శనివారం సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. గత రెండు రోజులుగా హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.  

ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం కేసీఆర్ కేంద్ర పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు.

 

 

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించినందుకు హర్దీప్ సింగ్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణలోని సిద్ధిపేట, వరంగల్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు, పలు విషయాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన కేసీఆర్.. హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. వరద సాయంతో పాటు ఇతర కీలక అంశాలపైనా  చర్చ జరిగినట్లు తెలిసింది. ఇద్దరు నేతల మధ్యా సుమారు 45 నిమిషాల పాటు చర్చలు సాగాయి.