తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఉత్తర భారత పర్యటనలో ఉన్న కేసీఆర్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఉత్తర భారత పర్యటనలో ఉన్న కేసీఆర్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్‌కు తన నివాసంలో స్వాగతం పలికిన కేజ్రీవాల్.. శాలువతో సత్కరించారు. ఇరువురు నేతలు కలిసి భోజనం చేయనున్నారు. ఈ భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షాల ఉమ్మడి ఐక్య వేదిక సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి చండీగఢ్ వెళ్లనున్నారు. అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. చండీగఢ్‌లోని ఠాగూర్ థియేటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు.
ఇక, దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం కేసీఆర్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన అఖిలేష్ యాదవ్‌కు కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం అఖిలేశ్‌తో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. గంటకు పైగా దేశంలో ప్రస్తుత రాజకీయాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం గురించి ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది.
అనంతరం శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని దక్షిణ మోతీభాగ్ ప్రాంతంలో ప్రభుత్వ సర్వోదయ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. విద్య విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ప్రశంసనీయమని కేసీఆర్ మీడియా మాట్లాడుతూ చెప్పారు. అయితే ఢిల్లీ మోడల్‌ను తెలంగాణలో అవలంబించబోమని, కానీ.. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపించి శిక్షణ ఇప్పిస్తామన్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగే మంచి పనులను తాము కూడా నేర్చుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. అనంతరం మహ్మద్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌ను కూడా కేసీఆర్ సందర్శించారు.
ఇక, అఖిలేశ్‌తో సమావేశంపై కేసీఆర్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇద్దరు వ్యాపారవేత్తలు కలిస్తే వ్యాపారం గురించి.. ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాల గురించి చర్చిస్తారు.. అదేం పెద్ద రహస్యం కాదు.. దేశంలో సంచలనం రావాలి.. అదే జరుగుతుంది.. వేచి చూడండి’’ అని అన్నారు.
