శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వైఎన్ ను మించిన మూర్ఖుడు జగన్ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మూర్ఖత్వంలో జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మించిపోయారని ఆయన అన్నట్లు సమాచారం శనివారం దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులపై, వాటిని అడ్డుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మించి అన్యాయం చేయడానికి జగన్ ఒడిగట్టారని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. 

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కు చట్టాలపై ఏ మాత్రం గౌరవం లేదని, అక్రమ ప్రాజెక్టులు అందుకు ఉదాహరణ అని, అక్రమ ప్రాజెక్టులపై మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని ఎత్తుకెళ్తున్నారని ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. దానిపై మౌనంగా ఉంటే తప్పు చేసినట్లు అవుతుందని ఆయన అన్నారు. తమపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు అన్యాయం చేసినవారమవుతామని కేసీఆర్ అన్నట్లు చెబుతున్నారు. 

ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సిందేనని, ఇందుకు ఏ మేరకైనా పోరాటం చేయాల్సిందేనని ఆయన అన్నారు. అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేసే విషయంపై నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్లు సమాచారం. 

న్యాయస్థానాలను ఆశ్రయిద్దామని ఆయన చెప్పారు. కృష్ణా బేసిన్ లో ఏపి ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టడానికి మన రాష్ట్రంలో ఏడెనిమిది ప్రాజెక్టులు నిర్మిద్దామని కేసీఆర్ అన్నట్లు చెబుతున్నారు.