:తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. రూ. 400 కోట్లతో ఈ భవన నిర్మాణ పనులను  చేపట్టనున్నారు.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలోని ప్రధాన బ్లాక్‌గా ఉన్న సీ బ్లాక్‌కు ఈశాన్య ప్రాంతంలో భూమిపూజ  చేశారు సీఎం కేసీఆర్. ఏపీకి చెందిన భవనాలను కూడ తెలంగాణకు అప్పగించారు. ఈ తరుణంలో 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ భావించారు.తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. 9 మాసాల్లో ఈ భవనాన్ని పూర్తి చేయాలని  సర్కార్ ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఆవరణలోనే ఏపీ ప్రభుత్వానికి నాలుగు బ్లాకులను కేటాయించారు. హెచ్, జే, కె, ఎల్ బ్లాకులను ఏపీకి రాష్ట్ర విభజన సమయంలో కేటాయించారు. ఏ,బీ, సీ, డీ బ్లాకులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి.

 ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అంగీకరించారు. దీంతో ఈ భవనాల అప్పగింత రెండు రోజుల క్రితమే పూర్తైంది. దీంతో  ఇవాళ మంచి ముహుర్తం ఉన్నందున కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.వేద మంత్రాల మధ్య కేసీఆర్ భూమి పూజ చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అయితే తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ కొందరు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 27వ తేదీన ఈ విషయమై హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో  తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడం లేదని హైకోర్టుకు తెలంగాణ సర్కార్ అఫిడవిట్‌ను ఇచ్చింది. 

ఈ విషయాన్ని కూడ పిటిషనర్లు గుర్తు చేస్తున్నారు.కొత్త సచివాలయం నిర్మాణం కోసం  ఇప్పటికే ఆర్‌అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో  కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత డీ బ్లాక్‌ను  కూల్చివేయనున్నారు. ఆయా బ్లాకుల్లోని శాఖలను, మంత్రుల పేషీలను ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించనున్నారు.

కొత్త తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన తర్వాత..... ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.