Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్: నేతల మధ్య సయోధ్య కుదిరేనా?

వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్  కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు.  టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య గ్యాప్ ఉన్న నేపథ్యంలో  కేసీఆర్ టూర్ కు ప్రాధాన్యత నెలకొంది. 

Telangana CM KCR Launches TRS Vikarabad  building
Author
Hyderabad, First Published Aug 16, 2022, 4:30 PM IST

వికారాబాద్: వికారాబాద్ లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు.  వికారాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ మంగళవారం నాడు వికారాబాద్ కు వచ్చారు.  వికారాబాద్ లో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ నూతన భవన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.   ఆ తర్వాత కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.  అంతేకాదు వికారాబాద్ జిల్లాకు మంజూరైన  మెడికల్ కాలేజీకి కూడా కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.   ఈ కార్యక్రమాల తర్వాత వికారాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

వికారాబాద్ జిల్లాకు చెందిన  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వర్గానికి  టీఆర్ఎస్  వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆనంద్ మధ్య  ఆధిపత్యపోరు సాగుతుంది. మరో వైపు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి, పట్నం మహేందర్ రెడ్డి కి కూడ పొసగడం లేదు.  దీంతో  ఇటీవలనే వికారాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.  అయితే ఈ సమావేశానికి మహేందర్ రెడ్డి ఆయన సతీమణి దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి సమాచారం లేని కారణంగా హాజరు కాలేకపోయినట్టుగా పట్నం మహేందర్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ తర్వాత మంత్రి కేటీఆర్ తో మహేందర్ రెడ్డి సమావేశమై జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలపై వివరించారు.

దీంతో ఇవాళ వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటుఇతర కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే జిల్లాకు చెందిన నేతల మధ్య చోటు చేసుకొన్న గ్యాప్ ను తగ్గించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తారా అనే చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2018 ఎన్నికల్లో తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన పట్నం మహేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీని కట్టబెట్టింది. అయితే తాండూరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన  రోహిత్ రెడ్డిని  టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారు అయితే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.   ఈ జిల్లాలోని నేతల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios