మందుబాబులకు తెలంగాణ ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రేపటి నుంచి మద్యం షాపులకు అనుమతిస్తున్నట్లు సీఎం తెలిపారు. కేంద్రం ఇచ్చిన సడలింపులతో 4 రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయని తెలంగాణకు ఏపీ, మహారాష్ట్రతో సుధీర్ఘ సరిహద్దు ఉందని కేసీఆర్ చెప్పారు.

నాలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచాయని... సరిహద్దు గ్రామాల ప్రజలు అక్కడికెళ్లి మద్యం తాగుతున్నారని సీఎం తెలిపారు. రాను రాను మద్యం స్మగ్లింగ్ తయారవుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

మద్యం దుకాణాలు తెరవాలని కేబినెట్ నిర్ణయించిందని .. రెడ్ జోన్ జిల్లాలో కూడా మద్యం షాపులు తెరుస్తారని కేసీఆర్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్‌లో మాత్రం మద్యం దుకాణాలు ఓపెన్ కావని స్పష్టం చేశారు.

మద్యం రేటు 16 శాతం పెంచుతున్నామని... బార్లు, పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి లేదని, భౌతిక దూరం పాటించకపోతే క్షణాల్లో షాప్ సీజ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.

చీప్ లిక్కర్‌పై మాత్రం 11 శాతం పెంచుతున్నామని.. మాస్కులు లేకపోతే మద్యం ఇవ్వరని, లాక్‌డౌన్ తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిర్వహించుకోవచ్చునని కేసీఆర్ వెల్లడించారు.