Asianet News TeluguAsianet News Telugu

ధరణి తీసేస్తే.. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే : ప్రజలకు కేసీఆర్ హెచ్చరిక

కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్ . ధరణి తీసేస్తే.. రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారులు, లంచాల రాజ్యం వస్తుందని ఆయన దుయ్యబట్టారు.

telangana cm kcr key comments on dharani portal at brs praja ashirvada sabha in kalwakurthy ksp
Author
First Published Nov 19, 2023, 6:41 PM IST

కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కల్వకుర్తిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద 
సభలో ఆయన ప్రసంగిస్తూ.. రైతుబంధు ద్వారా ప్రజల సొమ్ము వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కరెంట్ కూడా 24 గంటలు అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. 

రైతులకు రైతుబంధు, 24 గంటల కరెంట్ వద్దా అని సీఎం ప్రశ్నించారు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. అప్పుడు రైతుబంధు, ధాన్యం అమ్మిన డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ నిలదీశారు. ధరణి తీసేస్తే.. రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారులు, లంచాల రాజ్యం వస్తుందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో పింఛను ఎంత ఇచ్చారు , ఇప్పుడు ఎంత ఇస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. 

ALso Read: ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే, కాంగ్రెస్ బాగా పాలిస్తే .. ఎన్టీఆర్ టీడీపీ పెట్టేవారా : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పాలనలో పేదరికం, వలసపోవుడు, బతుకపోవుడేనని లంబాడీ బిడ్డలు హైదరాబాద్‌లో ఆటోలు నడపాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. జైపాల్ యాదవ్‌‌ను గెలిపిస్తే రైతుబంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నా వెంట పడి రెండు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీసుకొచ్చాడని సీఎం ప్రశంసించారు. ఇక్కడి 40 తండాలను గ్రామ పంచాయితీలు చేసుకున్నామని , గిరిజన బిడ్డల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచామని కేసీఆర్ తెలిపారు. 

అంతకుముందు నాగర్ కర్నూల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ ..  50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని.. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ దుయ్యబట్టారు. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రతో కలిపి ఇబ్బంది పెట్టారని సీఎం ధ్వజమెత్తారు. ఆంధ్రలో కలపడం వల్ల 60 ఏళ్లు ఎన్నో బాధలు పడ్డామని.. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ మళ్లీ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. పక్కనే ఉన్నప్పటికీ మహబూబ్‌నగర్  ప్రజలు కృష్ణా జలాలకు నోచుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్ధిక నిపుణులతో చర్చించి సంక్షేమ పథకాలు రూపొందించామని కేసీఆర్ వివరించారు. రూ.200 ఉన్న పింఛన్లను రూ.2 వేలకు పెంచామని సీఎం గుర్తుచేశారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి రైతుబంధు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ ఉండలేదని .. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని కేసీఆర్ గుర్తుచేశారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని.. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి వుండేదని సీఎం ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios