సీఎం దళిత సాధికారిత పథకం: దళితులకు శుభవార్త... రూ. 10 లక్షల ఆర్ధిక సాయం, కేసీఆర్ ప్రకటన
పేద దళిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
పేద దళిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున పది వేల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
సీఎం దళిత సాధికారిత పథకంపై ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతు బంధు పథకం మాదిరిగానే నేరుగా దళిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేయాలని నిర్ణయించారు.
ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ పై అఖిలపక్షంతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో ఈ స్కీమ్ ఉద్దేశ్యాలను వివరించారు. దళిత సమాజం ముందుకు వెళ్లడానికి ప్రభుత్వానికి సూచనలు చేయాలని సీఎం కోరారు. ఆత్మసైర్థ్యంతో దళిత సమాజం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read:‘‘ సఫాయన్నా నీకు సలాం ’’... ఇకపై పీఆర్సీ తరహా జీతభత్యాలు: సీఎం కేసీఆర్
దేశంలో సామాజికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు అని చెప్పే పరిస్థితి దారుణమన్నారు. ఈ బాధలు పోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకొంటుందని ఆయన చెప్పారు.పార్టీలకు అతీతంగా సమిష్టి కార్యాచరణతో బాధ్యత తీసుకొని దళితుల అభ్యున్నతికి పాటుపడుతామన్నారు. ఈ సమావేశానికి దళిత సామాజిక వర్గానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది.