ఆర్టీసీ సమ్మె, ప్రతిపక్షాలు ఒక్కటవ్వడం తదితర కారణాలతో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌దే విజయమని అందరూ భావించారు. అయితే ఓట్ల లెక్కింపు మొదలైన తొలి అర్ధగంట నుంచే సీన్ అర్ధమైపోయింది. మొత్తం 22 రౌండ్లలో ఏ ఒక్కదానిలోనూ టీఆర్ఎస్‌ మెజారిటీ తగ్గలేదు.

తాజా విజయంతో గులాబీ చీఫ్ వ్యూహా చతురత మరోసారి రుజువైంది. ఈ ఎన్నికలే కాదు.. ఎన్నికల పేరు మార్పు తప్పించి గత ఆరేళ్లుగా విజయం మాత్రం టీఆర్ఎస్‌నే వరిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధికారాన్ని అందుకున్న టీఆర్ఎస్ ఆ వెంటనే జరిగిన మెదక్, వరంగల్ లోక్‌సభ, నారాయణ ఖేడ్, పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు.. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాలు కైవసం చేసుకుని రెండోసారి అధికారాన్ని అందుకుంది.

Also Read:హుజూర్ నగర్ కృతజ్ఞతసభ: సీఎం కేసీఆర్ వరాలజల్లు

ఇక మున్సిపల్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంగతి సరే సరి. ఇటీవల జరిగిన జడ్పీ ఎన్నికల్లో దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా 32 జడ్పీ పీఠాలు దక్కించుకుని రికార్డు సృష్టించింది గులాబీ పార్టీ. ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి.

కేసీఆర్ ఛరిష్మా: తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల మాంత్రికుడు.. ప్రచార సభల్లో తన వాక్చాతుర్యంతో ప్రజలను మంత్రముగ్థుల్ని చేసే అరుదైన కళ ఆయన సొంతం. అన్నింటికి మించి వ్యూహా చతురత, పోల్ మేనేజ్‌మెంట్‌లో ఆయనకు తిరుగులేదన్నది ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే మాట. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రత్యర్థులపై వాడివేడి విమర్శలు చేయడంలో చంద్రశేఖర్ రావు దిట్ట. 

Also Read:ఏడడుగుల మంత్రి ఏం చేయలేదు, మా మూడడుగుల బుల్లెట్ నీళ్లు తెచ్చాడు: జగదీష్ రెడ్డిపై కేసీఆర్

ఉపఎన్నికలతోనే ప్రజల్లోకి: తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంచేందుకు టీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు ఉపఎన్నికలకు పిలుపునిచ్చేవారు. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీదే విజయం. అలా ఉపఎన్నికల్లో విజయాలను ఆనవాయితీగా మార్చుకున్న కేసీఆర్ తన గేమ్‌ప్లాన్‌తో ప్రత్యర్థులను చిత్తుచేసేవారు. 

టీడీపీ, వామపక్షాల ఓటు బ్యాంక్ టీఆర్ఎస్‌ ఖాతాలోకి: రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వామపక్షాలు ఉనికిని కోల్పోయే పరిస్దితి ఏర్పడింది. ఆ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి.

2014లో హుజూర్‌నగర్‌లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 25 వేల ఓట్లు సంపాదించగా.. తాజా ఉపఎన్నికల్లో కేవలం 1500 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. దీనిని బట్టి తెలుగు తమ్ముళ్లు సైకిల్‌ను వదిలి కారెక్కినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అలాగే సీపీఎంకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేలకు పైగా ఓట్లు రాగా.. ఇప్పుడు ఆ పార్టీ బలపరిచిన అభ్యర్ధికి వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ఇది ఒక్క హుజూర్‌నగర్‌కే పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి వున్నట్లు అర్థం చేసుకోవచ్చు. 

క్షేత్ర స్థాయిలో పటిష్టమైన క్యాడర్: పార్టీ స్థాపించినప్పుడు ఎలాంటి కార్యకర్తల బలం లేని తెలంగాణ రాష్ట్ర సమితి అనతికాలంలో జనంలోకి బాగా వెళ్లింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణలో బలంగా ఉండగా.. దక్షిణ తెలంగాణలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా ఉండేది కాదు.

అయితే రాష్ట్ర విభజన కేసీఆర్ నెత్తిన పాలుపోసినట్లయ్యింది. అధికారాన్ని అందుకున్న వెంటనే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బలమైన నేతలను ఆకర్షించడంతో నాయకులతో పాటు క్యాడర్ సైతం టీఆర్ఎస్‌కి మళ్లింది.

గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయిలో బడా నేతలను పార్టీలోకి చేర్చుకోవడం, గ్రామాల్లో కనీస క్యాడర్ లేకుండా కేసీఆర్ వ్యూహాలు గులాబీ పార్టీకి టానిక్‌లా పనిచేశాయి. అలా 2019 అక్టోబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలీయమైన శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది.  

మరో పదేళ్లు టీఆర్ఎస్‌దేనా: ఏ ఎన్నికలు చూసినా కారు ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో ఉనికిని చాటుకునేందుకు ప్రతిపక్షపార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతమైతే తమ పరిస్థితి ఏంటి అంటూ ఆయా పార్టీల నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.

రాష్ట్రంలో మంచి కేడర్‌తో పాటు క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తల బలమున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కృషి చేస్తున్నప్పటికీ గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు కారణంగా వరుస ఓటములు కాంగ్రెస్‌ను నైరాశ్యంలో ముంచేస్తున్నాయి.