గురువారం సిద్ధిపేట పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజిబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ర‌ంగ‌నాయ‌క‌ సాగ‌ర్ గెస్ట్‌హౌజ్‌ను కేసీఆర్ ప్రారంభించారు. సిద్దిపేట శివారులోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌, పెద్దకోడూరు గ్రామల సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ను 3 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం నిర్మించింది. 

అన్ని ప్రత్యేకతలే:

రిజర్వాయర్‌ మధ్యలో 45 ఎకరాల విస్తీర్ణంలో పల్లగుట్ట (కొండ) ఉంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఈ గుట్టపై రంగనాయక సాగర్‌ అతిథి గృహాన్ని సుమారుగా రూ. 7 కోట్లతో నిర్మించారు. దీని వెనుక భాగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాల‌యం ఉంది. ఈ అతిథి గృహాన్ని సుమారు ఎకరం విస్తీర్ణంలో జీ+2 పద్ధతిలో 21,000 ఎస్‌ఎఫ్‌టీలో నిర్మించారు. 

గ్రౌండ్‌ఫ్లోర్‌లో వేయిటింగ్‌హాల్‌, డైనింగ్‌హాల్‌తో పాటు ఆఫీస్‌ గది ఉంది. మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్‌హాల్‌, వేయిటింగ్‌హాల్‌ ఏర్పాటు చేశారు. పై అంతస్తులో వీవీఐపీ సూట్‌ ఒకటి, వీఐపీ సూట్‌లు రెండు, మినీ సూట్‌ను ఒకటి ఏర్పాటు చేశారు.

పల్లగుట్ట చుట్టూ గోదావరి జలకళను సంతరించుకొని ద్వీప కల్పంలా ఉంటుంది. ప్రస్తుతం రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌లో 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టం నుంచి 35 మీటర్ల ఎత్తు భాగంలో ఈ అతిథి గృహం ఉంటుంది.

రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 3టీఎంసీలు (490 ఎఫ్‌ఆర్‌ఎల్‌).  పల్లగుట్ట చుట్టూ 7.5మీటర్ల వెడల్పుతో 1.6 కి.మీటరు పొడవు రింగు రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో రానున్న రోజుల్లో రంగనాయక సాగర్‌ మంచి పర్యాటక కేంద్రంగా మారనుంది.