దిక్కుమాలిన రాజకీయాలకోసం పథకాలు పెట్టలేదు: గద్వాల కలెక్టరేట్ ప్రారంభించిన కేసీఆర్
గద్వాలలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు.
గద్వాల:పంజాబ్ కంటే అధికంగా వరిని తెలంగాణలో పండిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఐటీ రంగంలలో కూడ ముుందుకు దూసుకువెళ్తున్నామని కేసీఆర్ వివరించారు. గద్వాలలో నూతన కలెక్టర్ , ఎస్పీ కార్యాలయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు.
ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి నేరుగా గద్వాలకు చేరుకున్నారు. గద్వాలలో ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ఆయన కొత్త కలెక్టరేట్ లో ఉద్యోగులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా పాత కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాన్ని కేసీఆర్ సర్కార్ చేపట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తూ కొత్త కలెక్టరేట్లను నిర్మించారు. నిర్మాణాలు పూర్తైన కొత్త కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ఇవాళ గద్వాల కలెక్టరేట్ ను ప్రారంభించారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆయన చెప్పారు. తాగునీటి సరఫరాలో కూడ తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. దిక్కుమాలిన రాజకీయాల కోసం తాము పథకాలను ప్రవేశ పెట్టలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలను చేపట్టినట్టుగా కేసీఆర్ వివరించారు.
గద్వాల ప్రజల అవస్థలు చూసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో బాధపడ్డానని కేసీఆర్ చెప్పారు.గట్టు ఎత్తిపోతల పథకం పూర్తైతే బంగారంగా గద్వాల మారనుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గద్వాల జిల్లా ప్రజలు గతంలో అనేక బాధలు పడ్డారని ఆయన చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
అంతకుముందు బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు.