హైదరాబాద్: భాగ్యనగర ప్రజల దాహర్తి తీర్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 

మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తాగునీటి సమస్యకు శాశ్వతంగా స్వస్తిపలకాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. 

హైదరాబాద్ నగరంలో సాగునీటి సమస్యలకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు సంయుక్తంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంచినీటి రిజర్వాయర్, పైపులైన్ల కు సంబంధించి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. 

ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి మంచినీటి రిజర్వాయర్ నిర్మించే విషయంపై అధికారులతో కీలకంగా చర్చించారు. 

ప్రస్తుతం గోదావరి, కృష్ణా నీళ్ళను చాలా దూరం నుంచి హైదరాబాద్ తరలిస్తున్నామన్నారు. అయితే సంవత్సరం పొడవునా తాగునీటి సమస్యలు తీర్చలేకపోతున్నామని తెలిపారు. తాగునీటి సమస్య భవిష్యత్ లో రాకూడదనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుగుతోంది. 

ప్రాజెక్టుల నీటిలో పదిశాతం మంచినీళ్లకు వాడుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్ కు మంచినీళ్లు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. కేశవరం దగ్గర రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించాలని ఆదేశించారు. 

అందుకు వెంటనే అంచనాలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. గోదావరి, కృష్ణా నీటిని ప్రస్తుత పద్ధతిలో తరలిస్తూనే ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.