తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటి నుంచి ఆయన ఫార్మ్ హౌజ్ లోనే ఐసొలేషన్ లో ఉంటున్న విషయం విదితమే. కేసీఆర్ కి నిర్వహించిన యాంటిజెన్, ఆర్ టి పి సి ఆర్ టెస్టులు రెంటిలోనూ ఆయనకు కరోనా నెగటివ్ గా వచ్చింది. ఆయనకు నిర్వహించిన రక్త పరీక్షలు కూడా అన్ని నార్మల్ గానే వచ్చినట్టు తెలుస్తుంది. 

స్వల్ప లక్షణాలతో మాత్రమే ఉన్న కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లోనే ఉంటూ కోలుకున్నారు. ఆయనను నిత్యం వైద్యులు పర్యవేక్షిస్తూ ఆయనకు దగ్గరుండి చికిత్సనందించారు. మధ్యలో ఆయన సిటీ స్కాన్ కోసం యశోద ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు అంతా నార్మల్ గానే ఉండడంతో హోమ్ ఐసొలేషన్ కే మొగ్గు చూపడంతో ఆయన ఫార్మ్ హౌజ్ లోనే ఉంటూ వచ్చారు. రెండు రోజుల కింద నిర్వహించిన పరీక్షల్లో పూర్తి స్థాయిలో సరైన ఫలితాలు రానందున మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈసారి అన్నీ నార్మల్ గా ఉండడంతో కేసీఆర్ కోలుకున్నట్టుగా వైద్యులు ధృవీకరించారు. 

కేసీఆర్ తనయుడు కేటీఆర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కూడా కరోనా బారిన పడ్డారు. వీరు కూడా తొలుత హోమ్ ఐసొలేషన్ లోనే ఉన్నప్పటికీ... వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్యం కూడా ప్రస్తుతానికి నిలకడగా ఉంది, వేగంగా కోలుకుంటున్నట్టు సమాచారం. 

ఇకపోతే నిన్నొక్కరోజే తెలంగాణలో 6876 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,63, 361కి చేరుకొన్నాయి. కరోనాతో నిన్న 59 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,476కి చేరుకొంది. రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులున్నాయి.

నిన్న 70,961 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 3,854 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో113, భద్రాద్రి కొత్తగూడెంలో 121, జీహెచ్ఎంసీ పరిధిలో 1029, జగిత్యాలలో211,జనగామలో 65, జయశంకర్ భూపాలపల్లిలో78, గద్వాలలో96 కామారెడ్డిలో 118, కరీంనగర్ లో 264,ఖమ్మంలో 235, మహబూబ్‌నగర్లో 229, ఆసిఫాబాద్ లో 84, మహబూబాబాద్ లో133, మంచిర్యాలలో 188,మెదక్ లో 30 కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరిలో502,ములుగులో44,నాగర్ కర్నూల్ లో 190,నల్గగొండలో402, నారాయణపేటలో29, నిర్మల్ లో 58, నిజామాబాద్ లో218,పెద్దపల్లిలో96,సిరిసిల్లలో107,రంగారెడ్డిలో387, సిద్దిపేటలో 258 సంగారెడ్డిలో320,సూర్యాపేటలో258, వికారాబాద్ లో 171, వనపర్తిలో123, వరంగల్ రూరల్ లో 109,వరంగల్ అర్బన్ 354, యాదాద్రి భువనగిరిలో 183 కేసులు నమోదయ్యాయి.