ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధాన్యం కొనలేనప్పుడు దద్దమ్మలమని చెప్పొచ్చుగా అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల్ని నూకలు తినమంటున్నారంటూ ఫైరయ్యారు

ధాన్యం కొనలేమని (paddy procurement) , తాము దద్దమ్మలమని చెప్పొచ్చు కదా అంటూ కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం వుందన్నారు సీఎం కేసీఆర్. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో (khalistan terrorists) పోల్చిందని ఆయన ఫైరయ్యారు. ఎరువుల ధరల్ని కేంద్రం భారీగా పెంచిందని.. బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చిందని సీఎం తెలిపారు. వ్యవసాయానికి కార్పోరేటర్లకు అప్పగించడానికి కేంద్రం కుట్రం చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ధాన్యం కొనమంటే, నూకలు తినాలంటూ కేంద్రమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ సాధించిన ఘనత కేంద్రానికి చేతకాక, కుట్రలకు పాల్పడుతోందని కేసీఆర్ ఆరోపించారు. ఏ రాష్ట్రంలో పండించనంత పంటను తాము పండించామని సీఎం తెలిపారు. 

జీవో 111ను (go no 111) ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేయడం ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త అన్నారు. జీవో 111 ఎత్తివేతపై త్వరలో సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలో (shamshabad airport) సెకండ్ రన్‌ వేపైనా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్.. ఇండియాలోనే రద్దీ పరంగా నాలుగో స్థానంలో వుందని, విస్తీర్ణం పరంగా ప్రథమ స్థానంలో వుందని కేసీఆర్ చెప్పారు. 

టెర్మినల్ నార్త్ సైడ్ ఇంకో రన్ వే వస్తుందని సీఎం తెలిపారు. ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి బోర్డు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. మూసీ, ఈసా నదులు కలుషితం కాకుండా ప్రత్యే చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ధ్వంసమైందని కేసీఆర్ చెప్పారు. యూనివర్సిటీల్లో 3,500 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

త్వరలోనే హైదరాబాద్‌లో ఫార్మా యూనివర్సిటీ (pharmacy university) ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. అప్పట్లో భూగర్భ జలాలే దిక్కయ్యాయని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి కేకలు, ఆత్మహత్యలు జరిగాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్ వల్ల పంటల దిగుబడులు పెరిగాయని.. 2014 నుంచి 2022 వరకు కోటి ఎకరాల విస్తీర్ణం పెరిగిందని సీఎం చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.