టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు.. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ దేశరాజధానికి పయనమయ్యారు. కంటి, పంటి పరీక్షల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగే అవకాశం ఉన్నందుకే కేసీఆర్ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని సీఎం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలోనే ఉండటం.. జాతీయ నేతలతో వరుస సమావేశాల్లో పాల్గొనడంతో ఇద్దరు చంద్రులు తమ రాజకీయాలను చక్కబెట్టేందుకే ఢిల్లీలో మకాం వేశారని విశ్లేషకులు అంటున్నారు.