తెలంగాణలోని వ్యవసాయ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. జూన్ 11 నుంచి డిజిటల్ పైలెట్ సర్వే చేస్తామని.. పైలట్ ప్రాజెక్ట్ కోసం 27 గ్రామాల్ని ఎంపిక చేశామని సీఎం తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలోని 3 గ్రామాలు, మిగిలిన జిల్లాల్లో 24 గ్రామాలు ఎంపిక చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. పట్టాదారు భూములకు శాశ్వత రక్షణ చర్యలే లక్ష్యమన్నారు. ప్రజల భూ హక్కుల కాపాడేందుకే డిజిటల్ సర్వే చేస్తున్నామని.. ముందుగా వ్యవసాయ భూములు, తర్వాత పట్టణ భూముల సర్వే నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పైలట్ సర్వే తర్వాత పూర్తి సర్వేకు విధివిధానాలు నిర్ణయిస్తామని.. అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తోందని కేసీఆర్ ప్రశంసించారు. 

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామని కేసీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తెలిపారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read:తెలంగాణలో డిజిటల్ సర్వే.. చర్యలు వేగవంతం, త్వరలో 7 కంపెనీలతో సీఎస్ భేటీ

రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయిందని సీఎం స్పష్టం చేశారు. నోరులేని, అమాయక రైతులకు న్యాయం జరిగిందని, ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగిందని కేసీఆర్ గుర్తుచేశారు.