Asianet News TeluguAsianet News Telugu

ఒకే వేదికపై గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.. హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం..

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. 

Telangana CM KCR Attends High Court CJ Swearing in ceremony in Raj Bhavan
Author
First Published Jun 28, 2022, 10:18 AM IST

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ అభివాదం చేస్తూ లోనికి వెళ్లారు. సీఎం కేసీఆర్.. రాజ్‌భవన్‌కు రావడం తొమ్మిది నెలల తర్వాత ఇదే తొలిసారి. ఇంకా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ఇక, గత కొంతకాలంగా రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య గ్యాప్‌ పెరిగిన సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన పలు వేడుకలను సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. నేడు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరు కావడంతో.. చాలా కాలం తర్వాత గవర్నర్, సీఎంలు ఒకే వేదికపై కనిపించినట్టు అయింది. 

ఇదిలా ఉంటే..  తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అనంతరం ఐదో ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ భుయాన్ 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 20వ తేదీన నిర్దారించబడ్డారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అస్సాం జ్యుడీషియల్ అకాడమీ, గౌహతిలోని నేషనల్ లా యూనివర్శిటీలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. 

 

తర్వాత ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. 2019 అక్టోబర్ 3వ తేదీన బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ముంబైలో రెండేళ్లపాటు పనిచేసిన తర్వాత.. ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా ఉన్న ఆయనకు ఇటీవలే హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios