రేపు(ఆదివారం) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి నేరుగా తిరుపతికి వెళ్లనున్న ఆయన ఏపిలోనే రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే మొదటిరోజు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే రెండో రోజు ఆయన పర్యటన వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత వైసిపి అధినేత శనివారం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ ప్రగతిభవన్ కు భార్య భారతితో కలిసి వెళ్లిన జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. జగన్ ఆహ్వానంపై కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. 

అయితే వీరి కలయిక జరిగిన మరుసటి రోజే కేసీఆర్ తిరుపతి పర్యటన చేపట్టడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే కేసీఆర్ కుటుంబంతో కలిసి వ్యక్తిగత  పనులపైనే తిరుపతికి వెళుతున్నట్లు సమాచారం. కానీ రెండు రోజుల పాటు ఆయన అక్కడే  బసచేయడమే అనుమానాలకు  తావిస్తోంది. ఆయన పర్యటనపై ఏదైనా రాజకీయ కారణాలు కూడా దాగున్నాయేమోనని అనుమానం  వ్యక్తమవుతోంది.