మత,కులపిచ్చితో ప్రజలను విడదీస్తే దేశం మరో ఆఫ్థనిస్తాన్ కానుంది: మహబూబాద్ లో కేసీఆర్

దేశానికి  వెలుగునిచ్చే  చైతన్య వీచిక తెలంగాణ నుండే  రావాలని  కేసీఆర్ ఆకాంక్షను వ్యక్తం  చేశారు.  ఇందులో   తెలంగాణ ప్రజలు  భాగస్వామ్యులు  కావాలన్నారు. 

Telangana CM KCR  announces to  Engineering College  To  Mahabubabad

మహబూబాబాద్:మత పిచ్చి, కులపిచ్చితో  ప్రజలను విడదీస్తే  దేశం  మరో ఆఫ్ఘానిస్తాన్ లా తయారు కానుందని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. మహబూబాబాద్ లో  కొత్త కలెక్టరేట్ ను  సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన  కార్యక్రమంలో  కేసీఆర్ ప్రసంగించారు. శాంతి, సహనంలతో  సకల జనుల సంక్షేమాన్ని ఆకాంక్షించాలన్నారు. ప్రజల మధ్య  కులాలు, మతాల పేరుతో  చిచ్చు పెడితే  తాలిబన్ మాదిరిగా  మారే అవకాశం ఉందన్నారు.  విద్వేషాలతో  జాతి జీవనాడే  దహించుకుపోయే  పరిస్థితి ఉంటుందని కేసీఆర్  చెప్పారు. యువత ఈ విషయమై  అప్రమత్తంగా  ఉండాలని కేసీఆర్  కోరారు.  మేధావులు కూడా ఈ విషయాలపై  ఆలోచించాలన్నారు.  భారతీయ పౌరుడిగా  తాను  ఆవేదనతో  ఈ మాటలు చెబుతున్నట్టుగా  కేసీఆర్  చెప్పారు.  

కేంద్రంలో  మంచి ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ది జరుగుతుందని  కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై   గ్రామాల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ ప్రజలను కోరారు.  దేశానికి వెలుగు మార్గం చూపే అద్భుతమైన చైతన్య వీచిక  తెలంగాణ నుండే రావాలనే ఆాకాంక్షను వ్యక్తం చేశారు. ఇందులో  మీరంతా  భాగస్వామ్యులు కావాలని కేసీఆర్  కోరారు. 

ఉద్యమ సమయంలో  తాను మహబూబాబాద్ కు  వచ్చిన విషయాన్ని ఆయన  గుర్తు చేసుకున్నారు.  ఈ ప్రాంతంలో  దారుణమైన కరువు పరిస్థితి ఉండేదన్నారు.ఈ పరిస్థితులు  చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా  కేసీఆర్ ప్రస్తావించారు.   వర్ధన్నపేట, పాలకుర్తిలో  సగం  పూర్తైన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావనుకున్నానన్నారు.   తమ నేలకు  ఎప్పుడొస్తావని గోదావరమ్మకు  మొక్కుకున్నానని  కేసీఆర్ చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినా  కూడా  నీళ్ల కేటాయింపులు జరగలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం  చేశారు.  మొండిగా  ముందుకు వెళ్లి  కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని  కేసీఆర్  చెప్పారు.  మిషన్ భగీరథ  మన దాహం తీర్చిందన్నారు.  నదుల్లో  మన అవసరాలకు  మించి  నీళ్లున్నాయన్నారు. కానీ ఆ నీటిని  ప్రజల అవసరాలకు  ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందని  కేసీఆర్  చెప్పారు. విద్యుత్ విషయంలో  కూడా  ఇదే  పరిస్థితి ఉందని చెప్పారు.  

 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కురవి వీరభధ్రుడికి ముక్కుకున్నట్టుగా కేసీఆర్  తెలిపారు. కురవి వీరభధ్రస్వామి దయ, మానుకోట రాళ్లబలం కలిసి తెలంగాణ రాష్ట్రం సాకారమైందని  కేసీఆర్  తెలిపారు.  నియోజకవర్గంలోని గ్రామ పంచాయితీలకు  రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్టుగా  కేసీఆర్ ప్రకటించారు.ఈ నిధులపై  సర్పంచ్ లకే  పూర్తి అధికారం ఉంటుందని ఆయన  వివరించారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  దేవుడి దయతో  అన్నీ సమస్యలను  పరిష్కరించుకున్నామని  కేసీఆర్  చెప్పారు. మహబూబ్ నగర్ కు  ఇంజనీరింగ్  కాలేజీని ఏర్పాటు  చేస్తామని  కేసీఆర్ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి  ఇంజనీరింగ్  కాలేజీ  ప్రారంభం కానుందని కేసీఆర్  హామీ ఇచ్చారు,.  

గతంలో మహబూబాబాద్ కు  ప్రస్తుతం  మహబూబాబాద్ కు తేడా  కన్పిస్తుందన్నారు.  మహబూబాబాద్  పట్టణానికి  రూ. 50 కోట్లు, జిల్లాలోని  మున్సిపాలిటీలకు   రూ. 25 కోట్లు  మంజూరు చేస్తున్నట్టుగా  కేసీఆర్  ప్రకటించారు.తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్ డీపీ  రూ. 5 లక్షల కోట్లు ఉండేదన్నారు.  ప్రస్తుతం  రూ. 11 లక్షలకు  చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల  రాష్ట్ర ప్రభుత్వం  రూ. 3 లక్షల కోట్లను నష్టపోయిందని  కేసీఆర్ విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లాకు  చెందిన నూకల రామచంద్రారెడ్డి పేరుతో పెద్ద సంస్థను ఏర్పాటు  చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. నూకల రామచంద్రారెడ్డి మాజీ ప్రధాని వీవీ నరసింహరావుకు గురువు అని  కేసీఆర్  చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios