Asianet News TeluguAsianet News Telugu

సింగరేణీ కార్మికులకు దసరా కానుక.. లాభాల్లో 29 శాతం వాటా: కేసీఆర్ ప్రకటన

సింగరేణీ (singareni collieries) కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) దసరా (dussehra) కానుక ప్రకటించారు. లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా ప్రకటించారు సీఎం. గతేడాది కంటే ఒక్కశాతం పెంచారు సీఎం. కార్మికులను దృష్టిలో వుంచుకుని దసరా కంటే ముందే వాటాను చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తరించాలని సీఎం సూచించారు. 

telangana CM KCR announces 29 percent share in profits to Singareni workers
Author
Hyderabad, First Published Oct 5, 2021, 9:13 PM IST

సింగరేణీ (singareni collieries) కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) దసరా (dussehra) కానుక ప్రకటించారు. లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా ప్రకటించారు సీఎం. గతేడాది కంటే ఒక్కశాతం పెంచారు సీఎం. కార్మికులను దృష్టిలో వుంచుకుని దసరా కంటే ముందే వాటాను చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తరించాలని సీఎం సూచించారు. 

సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సీఎం పునరుద్ఘాటించారు. బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సింగరేణిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, దివాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియ నాయక్, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సంఘం నాయకులు కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్  నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని ప్రశంసించారు. నిబద్దతతో నిరంతర శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వున్నదని కేసీఆర్ తెలిపారు. 

ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు మన రిటైరయిన సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాలను నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. అలాంటప్పుడు మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేట్ పరం చేస్తుండటం శోచనీయమన్నారు.  తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. వారి నైపుణ్యాన్ని,శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుందన్నారు.  బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థలో రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రెండు వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios