అస్వస్థతకు గురైన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వడదెబ్బ కారణంగా ఇంకా జ్వరము, నీరసం తగ్గలేదని సమాచారం. డిహైడ్రేషన్ కావడంతో భట్టి విక్రమార్కకి సెలైన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మండుటెండలో పాదయాత్ర చేస్తూ వుండటంతో ఆయన తీవ్ర జ్వరానికి గురయ్యారు. దీంతో సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యులు రెండో రోజు కూడా చికిత్స అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా ఇంకా జ్వరము, నీరసం తగ్గలేదని సమాచారం. డిహైడ్రేషన్ కావడంతో భట్టి విక్రమార్కకి సెలైన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అనారోగ్యానికి గురైపన భట్టి విక్రమార్కను గ్రామ పాదయాత్ర శిబిరం వద్ద సీనియర్ కాంగ్రెస్ నేతలు కేఎల్‌ఆర్,ప్రేమ్ సాగర్ రావు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రేపు (శుక్రవారం) భట్టి విక్రమార్క పాదయాత్రను యథావిధిగా ప్రారంభిస్తారని సమాచారం. కేతేపల్లి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. 

మరోవైపు.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా భట్టి విక్రమర్కను పాదయాత్ర శిబిరంలో కలిశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిక సంబంధించి మల్లుభట్టి విక్రమార్క‌తో పొంగులేటి చర్చించారు. సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటి.. ఇద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైన భట్టి, పొంగులేటి మధ్య చర్చ జరిగింది. త్వరలో ఖమ్మంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసే సభను సక్సెస్ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలో కూడా వీరు చర్చించుకున్నట్టుగా సమాచారం. 

ALso Read: సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లోకి రావడం లేదు.. భట్టిని పరామర్శించిన అనంతరం పొంగులేటి..

అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టడం అభినందనీయం అని అన్నారు. అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలసుకుంటూ భట్టి ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఆయనను పరామర్శించేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. 

ప్రజలు కలలు కన్న తెలంగాణ.. కాంగ్రెస్ తోనే సాధ్యం అని పేర్కొన్నారు. తాను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్ లోకి రావట్లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టంచేశారు. కేసీఆర్ ను గద్దె దించదానికి ఎన్ని మెట్లు దిగడానికైన సిద్ధమేనని అన్నారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో దోపిడీకి గురవుతుందని విమర్శించారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. పొంగులేటిని మనస్పూర్తిగా కాంగ్రెస్‌లోని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు.