ఉచిత విద్యుత్ మా పేటెంట్ : కాంగ్రెస్ ఏం ఇచ్చిందా.. వైఎస్ సంతకం పెడుతున్న ఫోటోతో భట్టి సెల్ఫీ
ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వాట్సాప్ డీపీలో సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ఫోటోలు పెట్టుకుని విసృత ప్రచారం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేయాలనే ఉద్దేశంతో ‘‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’’కి శ్రీకారం చుట్టారు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఫైల్‌పై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేసిన ఫోటోతో భట్టి సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఏం ఇచ్చింది అనే వారికి సమాధానం ఇదేనని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ప్రాజెక్ట్‌ల వద్దకు కూడా వెళ్లి సెల్ఫీ దిగి జనానికి చెబుతామని.. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారం చేసే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం వుంటుందని.. కేసీఆర్‌కి పిచ్చి ముదిరి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మెట్రో ఎలా వచ్చిందో , ఇచ్చింది ఎవరో కూడా అక్కడ కూడా సెల్ఫీ ప్రోగ్రాం పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఓఆర్ఆర్, రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్, పరిశ్రమలు, ప్రాజెక్ట్‌ల దగ్గర కూడా సెల్ఫీ దిగుతామని భట్టి చెప్పారు. తమకు ఎవరూ పోటీ కాదని.. బీఆర్ఎస్ ఎత్తిపోయిన పార్టీ, ఎత్తిపోతున్న పార్టీ అంటూ విక్రమార్క సెటైర్లు వేశారు.
ALso Read: గులాబీ గూటికి చేరేందుకు ఉత్తమ్ దంపతులు సిద్దం?.. ఆ ఒక్క విషయంపై క్లారిటీ కోసం..
వ్యవసాయం నీటిపారుదల అనే అంశం కింద రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీ, విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పరిష్కారిస్తామని భట్టి హామీ ఇచ్చారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను, యంత్రాలను ప్రవేశపెట్టడం, యంత్రాల నిర్వహణలో రైతుకు తగిన శిక్షణ ఇవ్వడం, భూసార పరీక్షలు నిర్వహించడం, పంట మార్పులపై ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇవ్వడం చేపడతామన్నారు.
మేలు రకం విత్తనాలు, పురుగు మందులు సమకూర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం, కల్తీదారులను కఠినంగా శిక్షించడం తదితర అంశాలను అప్పటి మేనిఫెస్టోలో పొందుపరిచామని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమంలో తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే వాట్సాప్ డీపీలో సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ఫోటోలు పెట్టుకుని విసృత ప్రచారం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.