ఆస్తిలో హక్కులు కల్పించి, లింగ వివక్ష లేకుండా చేసిన రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు, వాక్ స్వాతంత్రం, భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అంటూ భట్టి నిలదీశారు.
దేశానికి కొత్త రాజ్యాంగం (new constitution) అవసరమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీలు (bjp) నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మహిళను బానిసలాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌దని (br ambedkar) భట్టి ప్రశంసించారు. ఆస్తిలో హక్కులు కల్పించి, లింగ వివక్ష లేకుండా చేసిన రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు, వాక్ స్వాతంత్రం, భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అంటూ విక్రమార్క నిలదీశారు.
ఇక నిన్నటి ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) హైదరాబాద్ పర్యటనపైనా భట్టి స్పందించారు. మోడీ పర్యటనంతా రామానుజాచార్యుల స్పూర్తికి (samatha murthy) భిన్నంగా సాగిందని ఎద్దేవా చేశారు. సమతా మూర్తి సిద్దాంతం ప్రచారం కోసం కాకుండా… బీజేపీ ప్రచారం మాదిరిగా సాగిందని విక్రమార్క విమర్శించారు. రామానుజాచార్యుల సిద్దాంతం కాకుండా… మోడీ బీజేపీ సిద్దాంతం చెప్పారంటూ దుయ్యబట్టారు. మోడీకి స్వాగతం నుండి మొదలుకుని… సెండ్ ఆఫ్ వరకు అంతా బీజేపీ నేతలేనని వ్యాఖ్యానించారు. అన్ని మతాలు, కులాలు సమానం అని చెప్పిన మానవతా మూర్తి రామానుజ చార్యులని.. దానికి భిన్నమైన విధానం మోడీదని విక్రమార్క దుయ్యబట్టారు. రామానుజాచార్యులతో పాటు… తెలంగాణకి అవమానం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రామానుజ ఫిలాసఫీని కూడా రాజకీయ లబ్దికి వాడుకున్నారని విక్రమార్క ఆరోపించారు.
ఇకపోతే కొత్త రాజ్యాంగం కావాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం టీ కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు హక్కులు కల్పించిన పవిత్ర గ్రంథం రాజ్యాంగమని భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు సైతం సమాన హక్కులు కల్పించిందని ఆయన గుర్తుచేశారు.
రాజ్యాంగం అంటే రిజర్వేషన్ ఒక్కటే కాదని.. జీవన విధానమని భట్టి అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, జీవించే హక్కులను రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగం లేకుంటే పాలనలో మనకు భాగస్వామ్యం వుండేది కాదని విక్రమార్క అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం పనికి రాదు అని చెప్పడం అంటే నియంత ఆలోచనే అంటూ ఆయన దుయ్యబట్టారు. రాచరికం కోరుకునే వాళ్లే రాజ్యాంగం వద్దని అంటారంటూ భట్టి ఎద్దేవా చేశారు. ఇంత ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనంటూ ఆయన ఫైర్ అయ్యారు.
ప్రజలకు హక్కులు వద్దనే మాటలు రాజులు మాత్రమే చెబుతారంటూ భట్టి ఆరోపించారు. నేను మాత్రమే రాజ్యం ఏలాలి అనుకునే వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరని విక్రమార్క దుయ్యబట్టారు. రాజ్యాంగం పనికి రాదని చెప్పిన కేసీఆర్‌ను సీఎంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు రాష్ట్రపతి, గవర్నర్ చొరవ చూపాలని భట్టి కోరారు. రాజ్యాంగం గురించి తప్పుడు మాటలు మాట్లాడిన కేసీఆర్‌ను ఏం చేసినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు రాజ్యాంగం పనికిరాదని చెబుతున్నారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
