దళిత గిరిజనులతో పాటు అల్పాదాయ వర్గాలకు కూడా దళిత బంధు తరహా పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గడిచిన ఏడేళ్లుగా రాష్ట్ర నిధులు దుర్వినియోగమవ్వడమే కాకుండా ప్రశ్నించేవాడేవరూ ఈ రాష్ట్రంలో బతికి వుండకూడదని నిరంకుశ పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పెట్టామని విక్రమార్క తెలిపారు.
సెప్టెంబర్ 17న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభను గజ్వేల్‌లో ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం.. బానిస బతుకు నుంచి స్వాతంత్య్రం పొందినటువంటి పవిత్రమైన రాజు సెప్టెంబర్ 17, 1948 అన్నారు. రామానంద తీర్ధ నుంచి ఎంతోమంది వరకు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్య్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన రోజని భట్టి చెప్పారు.
తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. స్వాతంత్య్ర వేడుకలు జరుపుతుంటే తెలంగాణ ప్రాంతంలో వున్న ప్రజానీకం మాత్రం ఇంకా స్వాతంత్య్రం రాక రాచరిక వ్యవస్థలో ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని విక్రమార్క గుర్తుచేశారు. కానీ ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని.. అయినప్పటికీ అనేక రకాలుగా హింసిస్తూ, ఉరి తీశారని వెల్లడించారు. ఈ అకృత్యాలను చూడలేక నెహ్రూ .. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో జనరల్ చౌదరిని తెలంగాణపై సైనిక చర్యకు పంపించారని తెలిపారు. ఆనాటి ఆ పోరాటంలో ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు.
ఆత్మగౌరవంతో బతకాలని.. ఈ రాష్ట్రంలోని సహజ వనరులు అందరికీ సమానంగా పంచబడాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని విక్రమార్క వెల్లడించారు. కానీ గడిచిన ఏడేళ్లుగా రాష్ట్ర నిధులు దుర్వినియోగమవ్వడమే కాకుండా ప్రశ్నించేవాడేవరూ ఈ రాష్ట్రంలో బతికి వుండకూడదని నిరంకుశ పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పెట్టామని విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 18 లక్షల మంది దళితులకు దళిత బంధును అమలు చేయాలంటే లక్షా 80 వేల కోట్లు ఖర్చవుతాయని కేసీఆర్ తెలిపారని గుర్తుచేశారు. దళిత గిరిజనులతో పాటు అల్పాదాయ వర్గాలకు కూడా దళిత బంధు తరహా పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
