తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తానని ప్రమాణం చేసిన సీఎం.. తన స్వగ్రామాన్ని చూసినట్లుగానే, రాష్ట్రంలోని అన్ని వర్గాలను చూడాలని సూచించారు.

చింతమడక గ్రామ ప్రజలకు ఇంటింటికీ రూ. 10 లక్షలు ఇచ్చినట్లుగానే.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. కేసీఆర్ తమను సమానంగా చూడటం లేదనే భావన ప్రజల్లోకి వెళితే.. రాష్ట్రంలో అశాంతి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పథకానికి చింతమడక స్కీం అని పేరు పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఇది కేసీఆర్ సొంత సొమ్ము కాదని, రాష్ట్ర ఖజానాలోనిదేనని భట్టి ఎద్దేవా చేశారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు మీడియా సంపాదకులను తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రతిపాదనకు సంబంధించిన సమగ్ర నివేదికతో పాటు అప్పుల వివరాలను మీడియాకు చూపించాలని భట్టి డిమాండ్  చేశారు.