హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం నాడు హైకోర్టు ముందు హాజరయ్యారు. కరోనా విషయంలో తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై సీఎస్ ను హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిది. ఈ ఆదేశాల మేరకు సీఎస్ తో పాటు పలువురు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కోర్టుకు హాజరయ్యారు.

కరోనా పరిస్థితులు, టెస్టులపై తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మా సహనాన్ని పరీక్షించొద్దని కూడ వ్యాఖ్యానించింది. కరోనా విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది, తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదనే విషయమై ఈ నెల 28వ  తేదీన హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు హాజరయ్యారు.

also read:సహనాన్ని పరీక్షించొద్దు, ఇదే చివరి అవకాశం: వైద్య శాఖపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడ  హైకోర్టు ముందు హాజరయ్యారు.

కరోనా బులెటిన్ లో సమగ్ర సమాచారం లేకపోవడంపై హైకోర్టు ప్రభుత్వ తీరుపై అక్షింతలు వేసింది. తాజాగా జారీ చేస్తున్న కరోనా బులెటిన్ పై కూడ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయాలపై హైకోర్టు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ కోరనుంది.

రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై సీఎస్ హైకోర్టుకు వివరిస్తున్నారు. సీఎస్ వివరణపై హైకోర్టు ఏ రకంగా స్పందిస్తోందోననేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.