మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగానే ముగిసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. బయటి నుంచి వచ్చిన వారిపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కౌంటింగ్‌లో మైక్రో అబ్జర్వర్స్‌కు ట్రైనింగ్ ఇచ్చామని.. ఈ నెల 6న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.  

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో వున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. సాయంత్రం 5 గంటల నాటికి 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. బయటి నుంచి వచ్చిన వారిపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 

వీటిపై తక్షణం స్పందించి వారిని వెంటనే పంపించి వేశామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలను తరలిస్తామని... నల్గొండలో ఈవీఎంలను భద్రపరుస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్‌లో మైక్రో అబ్జర్వర్స్‌కు ట్రైనింగ్ ఇచ్చామని.. ఈ నెల 6న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవసరం రాకపోవచ్చునని.. పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో ఓటర్లు వున్నారని.. వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని వికాస్ రాజ్ వెల్లడించారు. 

Also REad:మునుగోడు ఉపఎన్నిక : చండూరులో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్

ఇకపోతే... పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లను బీజేపీ ప్రలోభపెడుతుందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కి గురువారంనాడు ఫిర్యాదు చేశారు.చౌటుప్పల్,సంస్థాన్ నారాయణపురం,జనగామ,చండూరు,మర్రిగూడలలో బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి పిర్యాదు చేశారు.

ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఓటర్లకు ప్రలోభాల విషయమై టీఆర్ఎస్ ,బీజేపీ పరస్పరం పిర్యాదు చేసుకున్నాయి.అంతేకాదు స్థానికేతరులు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని బీజేపీ ఆరోపించింది.ఈ విషయమై చండూరు,మర్రిగూడల్లో బీజేపీ,టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మర్రిగూడలో ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు.సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో ఉన్నస్థానికేతరులను ఎన్నికల అబ్జర్వర్ పట్టుకున్నారు.ఫంక్షన్ హల్ లో నగదు,మద్యం సీజ్ చేశారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.