Best Tourism Award: తెలంగాణ గ్రామాలకు జాతీయ గుర్తింపు.. రాష్ట్రం నుంచి ఎంపికైన బెస్ట్ టూరిజం గ్రామాలివే..
Best Tourism Village Award: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తెలంగాణలోని రెండు గ్రామాలకు స్థానం దక్కింది. అందులో ఒక్కటి సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ కాగా, రెండవది జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామాలు. ఈ రెండు గ్రామాలు జాతీయ ఉత్తమ టూరిజం విలేజి అవార్డులకు ఎంపికయ్యాయి.

Best Tourism Village Award: తెలంగాణ గ్రామాలకు అవార్డు కొత్తేమి కాదు. జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు మరో గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ టూరిజం విలేజి అవార్డుల జాబితాలో తెలంగాణలోని రెండు గ్రామాలకు స్థానం దక్కింది. అందులో ఒకటి సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం కాగా.. రెండోది జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం. ఈ రెండు గ్రామాల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..
మొదటిది సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలంలోని చంద్లాపూర్ గ్రామం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన రంగానాయక సాగర్ రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపాన్నీ అద్భుతమైన టూరిజం స్టాట్ కాగా.. అక్కడే ఉన్న రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండల అందాలు.. చూస్తుంటే ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అన్న భావన వస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో ఈ ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతంగా మారింది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఈ ప్రాంతం ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కళా నైపుణ్యత, సంస్కృతి గొల్ల భామ చీర ప్రాచుర్యతకు నేడు జాతీయ స్థాయిలో దక్కిన గొప్ప గుర్తింపుగా ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండోవది పెంబర్తి గ్రామం జనగాం జిల్లాలోని హాసనపర్తి మండలంలో ఉంది. ఈ గ్రామం గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. కాకతీయుల కాలం నుంచి ఈ గ్రామం హస్తకళలకు చాలా ఫేమస్. ఈ గ్రామంలో తయారయ్యే ఇత్తడి,కంచు కళాకృతులకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ కళాకృతులు అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంటాయి. ఈ కళాకృతులు మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా ఉంటాయి. దేవతల విగ్రహాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఈ గ్రామంలోనే ప్రాణం పోసుకుంటాయి. ఏటా ఈ గ్రామాన్ని 25 వేల మంది పర్యాటకులు సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.
దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ అవార్డు కోసం 795 గ్రామాలు తమ దరఖాస్తులు రాగా.. ఇందులో తెలంగాణలోని చంద్లాపూర్ గ్రామంతో పాటు పెంబర్తి కూడా ఎంపికయ్యింది. ఈ రెండు గ్రామాలకు.. సెప్టెంబర్ 27న ఢిల్లీలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో అవార్డులు అందజేయనున్నారు. ఈ గ్రామ సర్పంచులు ఆ అవార్డులను అందుకోనున్నారు.