Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
 

telangana cabinet key decisions
Author
Hyderabad, First Published Sep 16, 2021, 5:46 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రిమండలి ఆమోదం లభించింది.  

రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు కేబినెట్‌ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 2.56 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంత్రివర్గానికి వివరించారు. నేటి నుంచి స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు వివరించారు. చిన్న పిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.  

ఈ నెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన కేబినెట్ దీనికి ఛైర్‌పర్సన్‌గా మంత్రి సత్యవతి రాథోడ్‌ను నియమించింది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సబ్‌కమిటీలో సభ్యులుగా ఉంటారు.  

కొత్త జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల సమస్యలపైనా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఛైర్మన్‌గా మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు.  

Follow Us:
Download App:
  • android
  • ios