Asianet News TeluguAsianet News Telugu

జగన్ బాటలో కేసీఆర్: ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్, కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. అయితే కొన్ని అంశాలపై రేపు మరోసారి సమావేశం కావాలని మంత్రి మండలి నిర్ణయించింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలపైనే కేబినెట్ విస్తృతంగా చర్చించింది.

telangana cabinet key decisions ksp
Author
Hyderabad, First Published Jul 13, 2021, 9:04 PM IST

ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన మంగళవారం కేబినెట్ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ తయారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా కేబినెట్ చర్చించనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్‌ అధికారులను ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్‌జీవో, టీజీవో విజ్ఞప్తిపై కేబినెట్‌లో చర్చ జరిగింది.  

Also Read:ప్రారంభమైన తెలంగాణ కేబినెట్: కీలక అంశాలపై చర్చ

గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు కేబినెట్‌కు నివేదిక సమర్పించాయి. దీనిపై స్పందించిన కేసీఆర్ నెలలోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.  

హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారు. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. అలాగే నీటి ఎద్దడి నివారణ చర్యలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా లే అవుట్లు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవస్థ ద్వారా లే అవుట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేయాలని కేసీఆర్ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios